కడప రిమ్స్ లో జనసేన ఇంఛార్జ్ తనిఖీ.. సౌకర్యాల లేమి పట్ల అసంతృప్తి

ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కరోనా ఉదృతి రోజు రోజుకీ పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెద్దాసుపత్రి రిమ్స్ లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. కోవిడ్ పేషెంట్ల సంగతి అటుంచితే నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులకు సైతం కనీస సౌకర్యాలు అందని దుస్థితి. తగినన్ని పడకలు అందుబాటులో లేకపోవడం, అత్యవసర విభాగంలో ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు విడుస్తున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. విషయం తెలుసుకున్న కడప అర్బన్ ఇంఛార్జ్, రాయలసీమ సంయుక్త కమిటీ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ రిమ్స్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కడప నగర అధ్యక్షులు మాలే శివ, స్థానిక జనసేన శ్రేణులతో కలసి రోగులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా ప్రాణవాయువు కొరత తీవ్రంగా ఉందన్న విషయాన్ని గ్రహించారు. కళ్ల ముందే అయిన వారు మృత్యువుతో పోరాడుతుంటే చూడలేక గుండెలు అవిసేలా రోదిస్తున్న వారిని కళ్లారా చూశారు.
సర్కారీ ఆసుపత్రి(రిమ్స్)లో, అదీ ముఖ్యమంత్రి జిల్లాలో ఉన్న ఆసుపత్రి పరిస్థితి ఇంత దారుణంగా ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే రిమ్స్ వైద్యాధికారులను, ఆర్.ఎం.ఒ.ను కలసి సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ.. రోగుల కుటుంబ సభ్యుల ఆవేదన చూస్తే కళ్లు చెమ్మగిల్లాయనీ, కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో పాలకులు కనీసం ప్రాణవాయువు కూడా అందుబాటులో ఉంచలేకపోవడం శోచనీయం అనీ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకువచ్చిన వారిని సైతం పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పెద్దాసుపత్రి పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించి రోగులకు తగిన సౌకర్యాలు, ప్రాణవాయువు అందుబాటులో ఉంచాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ విభాగానికి చెందిన తోట బాలసుబ్రహ్మణ్యం, నగర పార్టీ నాయకులు సురేష్, విజయ్, వినయ్, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.

 42 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆచారాల ఉల్లంఘనపై జనసేన-బీజేపీ నిరసన

ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 48 గంటల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *