అమరావతి రైతుల కోసం రాజీనామా చేయండి.. టిడిపి- కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలకు జనసేనాని డిమాండ్

• అమరావతిని రాజధానిగా నిలపాలన్న చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి
• రాజధాని వికేంద్రీకరణ పేరిట పాలకులే మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు
• రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దు అని మొదటి నుంచీ చెబుతున్న పార్టీ జనసేన మాత్రమే
• టిడిపి, వైసీపీ రైతులలో ఆశలు రేకెత్తించి వారి జీవితాలు ఛిద్రం చేశాయి
• టిడిపి, వైసీపీ పార్టీలు రెండూ ఒకేలాంటివి
• వైసీపీ తమ వ్యక్తిగత… పాత కక్షలతోనే రాజధాని మార్పు చేపట్టింది
• ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకొనేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారు
• టిడిపి లక్ష కోట్ల రాజధాని అన్నప్పుడూ…. వైసీపీ మూడు రాజధానులు అన్నప్పుడూ జనసేన ప్రమేయం లేదు
• ప్రశ్నించాల్సింది ఆ రెండు పార్టీలనే
• రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తాం
• జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చలో అధినేత  పవన్ కల్యాణ్ 
రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చి నడిరోడ్డుపైకి వచ్చేసిన రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కృష్ణా.. గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేసి పోరాటం చేయాలని జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్  డిమాండ్ చేశారు. తమ ప్రాంతం నుంచి రాజధాని తరలిపోతున్నందున వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి అమరావతిని నిలుపుకొనేందుకు పోరాడాలన్నారు. అధికార, ప్రతిపక్షాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, భూములు ఇచ్చిన రైతులపై బాధ్యత ఉన్నా ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టాలని సూచించారు. జనసేన పార్టీకి శాసన ప్రక్రియలో ఏ కొద్దిపాటి భాగస్వామ్యం ఉన్నా మొదటగా రాజీనామాలు చేసేదన్నారు. అమరావతిలో రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పుడు రాజధాని పరిరక్షణ వరకూ ప్రతి దశలోనూ రైతు పక్షపాతంతో గొంతు వినిపించిందీ… ఒకే మాటపై నిలిచిందీ జనసేన మాత్రమే అని చెప్పారు.
ఆదివారం ఉదయం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టారు. ఈ కాన్ఫరెన్స్ లో పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ , ఉభయ గోదావరి జిల్లాల ఇంచార్జ్, పీఏసీ సభ్యులు  కె.నాగబాబు , ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్ ,  టి.శివశంకర్ ,  సత్య బొలిశెట్టి  పాల్గొన్నారు.

కాల్ కాన్ఫరెన్స్ వివరాల్లోకి ఇలా ఉన్నాయి… శాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్ యార్డ్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో 11మంది మృత్యువాతపడటంపై సమావేశం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరచి, సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. రాజధాని వికేంద్రీకరణ, సి.ఆర్.డి.ఏ. రద్దు అంశాలపై జనసేన పీఏసీ చర్చించింది.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ అన్ని విధాలా కునారిల్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లాంటివి మాట్లాడటం బాధ్యతాయుతం కాదు అని మన పార్టీ భావించింది. అయితే ఇలాంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుదేలైంది. కరోనా నివారణ చర్యలు చేపట్టలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆసుపత్రుల్లో సరైన సేవలు లేవు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఓ క్రీడకు తెర తీశారు. పాత కక్షల కోసమో, ప్రస్తుత క్లిష్ట స్థితి నుంచి బయటపడేందుకో రాజధాని అంశాన్ని పాలకపక్షం నడిపిస్తోంది.
• వైసీపీ, తెలుగుదేశం పెద్దలను నిలదీయండి
రైతులకు అన్యాయం చేయడంలో వైసీపీ, టిడిపి పార్టీలు రెండూ ఒకలాంటివే. రూ.లక్ష కోట్లతో రాజధాని నిర్మిస్తాం అని తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు రూపొందించిన సమయంలోగానీ, మూడు రాజధానులుగా మారుస్తామని వైసీపీ నిర్ణయించిన సమయంలోనూ జనసేనకు ప్రమేయం లేదు. తప్పు చేసింది వైసీపీ, తెలుగుదేశం పార్టీలయితే జనసేనను ఎలా ప్రశ్నిస్తారు. నిలదీయాలనుకున్న వారు ఆ రెండు పార్టీల పెద్దలను నిలదీయాలి. అసలు అమరావతి నిర్మాణం విషయంలో ఆది నుంచి ఇప్పటి వరకూ జనసేన ప్రమేయమే లేదు. అయితే బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా అన్యాయమవుతున్న రైతుల పక్షాన పోరాడుతున్నాం.
• పార్టీ ఆర్థికావసరాలకు అనుగుణంగా రాజధాని మార్చుకొంటారా?
వ్యక్తిగత అజెండాలు, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా రాజధానులు ఉండవు. తమ పార్టీ ఆర్థికావసరాలకు అనుగుణంగా రాజధానులను మార్చుకొంటామంటే కుదరదు. భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు కూడా రాజధానిగా అమరావతే ఉండాలని, అందుకు సూత్రప్రాయంగా కట్టుబడి ఉన్నామని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ తో భేటీ అయినప్పుడు కూడా అమరావతి గురించి చర్చించాం. అమరావతికి నిధులు ఇస్తామని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిధులు ఆగిపోయాయని చెప్పారు.
అహ్మదాబాద్ లో 2014లో  నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా.. రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు అని చెప్పాను. అప్పుడు వారు ఒక మాట అన్నారు.. ‘మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు మా గుజరాత్ కీ రాజధాని లేదు. గాంధీనగర్ ను క్రమక్రమంగా అభివృద్ధి చేసుకొంటూ వచ్చాం. ఈ అభివృద్ధికి పాతికేళ్లుపట్టింది. అదే విధంగా ఎలాంటి హంగులు ఆర్భాటాలకుపోకుండా క్రమ పద్ధతిలో ఏపీ రాజధానిని నిర్మించుకోండి అని సూచించారు. తెలుగుదేశం నాయకత్వం కూడా తొలుత 2500 ఎకరాల నుంచి 3వేల ఎకరాలు ఉంటే రాజధానిని నిర్మించుకోవచ్చు… అటవీ భూమిని డి-నోటిఫై చేయమని కోరింది. అందుకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకొంది.

• టీడీపీ, వైసీపీ… రెండు పార్టీలూ ఒకటే
అప్పుడు 3 వేల ఎకరాలు అన్న టీడీపీ తరవాత 30 వేల ఎకరాలు, 40 వేల ఎకరాలు అంటూ పెంచుకొంటూ పోయింది. భూ సమీకరణ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకొంది. అందుకు అంగీకరించనివారిపైనా, అసైన్డ్ భూములున్నవారిపైనా బలవంతంగా భూ సేకరణ చట్టం ప్రయోగించబోయింది. 2015లో పెనుమాక, బేతపూడి, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల రైతులు ఈ బాధను, ఆందోళనను నా దృష్టికి తెచ్చారు. ఆ గ్రామాలకు వెళ్ళి రైతులకు అండగా నిలిచాను. ఇష్టపడి ఇస్తే తీసుకోండి, బలవంతంగా తీసుకోవద్దు అన్నాను. అప్పుడే అడిగాను – ఇన్ని వేల ఎకరాలు తీసుకొంటున్నారు, ప్రభుత్వం మారితే ఇక్కడి రైతులకు భరోసా ఏమిటి అని ప్రశ్నించాను. 2018లో విజయవాడలో రాజధాని రైతుల భూముల అంశంపై న్యాయకోవిదులతో, నిపుణులతో రైతుల సమక్షంలోనే సుదీర్ఘ చర్చా కార్యక్రమాన్ని జనసేన పక్షాన నిర్వహించాం. అప్పుడు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ గారు విలువైన సూచనలు చేశారు.
తొలి నుంచి ఇప్పటి వరకూ జనసేన చెబుతున్నది ఒకటే మాట – రైతు కన్నీరుపై రాజధాని నిర్మించవద్దు అని. తెలుగుదేశం, వైసీపీలు రెండూ ఒకటే. రాజధానికి సమీకరణ చేస్తున్న సమయంలో వీళ్ళు ఒకే విధంగా వ్యవహరించారు. చిన్న రైతుల్లో కూడా పెద్ద ఆశలు కల్పించారు. రెండు సెంట్లు, మూడు సెంట్లు ఉంటే కూరగాయలో, పూలో పండించుకొని బతికే చిన్నపాటి రైతులు కూడా రాజధానికి భూములు ఇచ్చారు. ఈ రెండు పార్టీలు రాజధానికి అనుకూలంగా ఉన్నాయనుకోవడం వల్లే భూములు ఇచ్చారు. ఇప్పుడు రైతుల జీవితాలను ఛిద్రం చేశారు. రాజధాని రైతుల ఆవేదనకు, అమరావతి నుంచి రాజధాని తరలిపోవడానికి ఆ రెండు పార్టీలు సంజాయిషీ ఇవ్వాలి.
•విభజన జరిగింది తెలంగాణలో భూముల వ్యవహారం వల్లే
ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఏర్పాటైన ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ చుట్టూ సాగించిన భూ వ్యవహారాలు, లావాదేవీల వల్లే తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఆవేదన గూడుకట్టుకొంది. రింగ్ రోడ్లు, ఎస్‌ఈజెడ్ లు అంటూ భూములు తీసుకొని కొందరికే ఇవ్వడంతో పేద ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. అది రాష్ట్ర విభజనకు దారి తీసింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య చిచ్చు రేపేలా వైసీపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని తీసుకువచ్చింది. ఈ మూడు ప్రాంతాల ప్రజల మధ్య ఎప్పుడూ సఖ్యత ఉంది. ఆ సుహృద్భావ వాతావరణాన్ని రాజధానుల పేరుతో పాడు చేయవద్దు. ప్రాంతీయ విభేదాలతో మరోసారి విడిపోయే స్థితి తీసుకురాకుండా చూడాలి. రాజధాని వికేంద్రీకరణ అంశంపై జనసేన పార్టీ న్యాయకోవిదులతో, నిపుణులతో కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్తుంది” అన్నారు.
• ప్రభుత్వమే ప్రజలను మోసగిస్తోంది: నాదెండ్ల మనోహర్ 
పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రక్రియ ప్రకారం చేసినది కాదు. వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమే ఇది. ఒక వ్యక్తి ఆలోచనల మేరకు… వ్యక్తిగత శతృత్వం, వ్యక్తిగత విభేదాలతో అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో మంత్రులకు కూడా రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తెలియవు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలకైతే ఏం జరుగుతుందో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు వాణిజ్య దృక్పథంతో రాజధాని నిర్మాణం విషయంలో కాలయాపన చేశారు. రాజధానికి సంబంధించి బలమైన చట్టం తీసుకువచ్చే విషయంలో శ్రద్ధపెట్టలేదు. ఆ అలసత్వం ఫలితంగానే ఇక్కడి నుంచి రాజధానిని వికేంద్రీకరిస్తున్నారు. ఆ అయిదేళ్లు  చంద్రబాబు బీద ఏడుపులు ఏడుస్తూ దీక్షలు చేశారు తప్ప రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై ప్రణాళికాబద్ధంగా వెళ్లలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రాజధాని వికేంద్రీకరణ అంటూ కాలం దొర్లిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో తప్పటడుగులు వేసి రాజధాని రైతులను నష్టపరచింది. ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుంది అనే ఉద్దేశంతోనే భూములను రైతులు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారు. ఒప్పందం ఉల్లంఘించి ప్రభుత్వమే ప్రజలను మోసం చేయడం ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలోనే జరుగుతోంది.
రాజధాని గ్రామాల్లో భూ కుంభకోణాలు జరిగాయి అని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ కుంభకోణాలు చేసినవారిని విచారించి శిక్షించమని జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్  చెప్పారు. ఆ పేరుతో రైతులను ఇబ్బందిపెట్టవద్దు… వారి త్యాగాలను గుర్తించమని చెప్పారు. ఆ విషయాల గురించి వైసీపీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు? రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్  పర్యటించి రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. మద్దతు తెలిపారు. తొలి నుంచి ఒక రైతులు నష్టపోకూడదు అని చెబుతున్న పార్టీ జనసేన మాత్రమే” అన్నారు.
ప్రధాన కార్యదర్శి  తోట చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ “అమరావతి అంశానికి సంబంధించి న్యాయ పోరాటం మార్గం ఉంది. మూడు రాజధానుల అంశానికి ప్రజలందరి ఆమోదం ఉన్నట్లుగా లేదు. రాజధానులు పెడతామని చెబుతున్న ప్రాంతాల్లోని ప్రజల్లో కూడా ఉత్సాహం కనిపించడం లేదు. అమరావతి విషయంలో పెద్ద తప్పిదం చేసింది  చంద్రబాబు నాయుడే. ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాజధాని తరలింపునకు ఆస్కారం కల్పించాయి. ప్రభుత్వమే ఈ విధంగా రైతులతో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇక ప్రజలకు ప్రభుత్వంపై ఏ విశ్వాసం ఉంటుంది” అన్నారు.
• రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడాలి:  కె.నాగబాబు 
పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ఇంచార్జ్, పీఏసీ సభ్యులు  కె.నాగబాబు  మాట్లాడుతూ “రాజధాని విషయంలో తొలి నుంచి ఒకే విధానం, ఒకే మాట మీద ఉన్నది జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ గారు మాత్రమే. అన్ని వేల ఎకరాల భూమిని సమీకరిస్తే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే రైతులకు ఎవరు భరోసాగా ఉంటారు అని 2015లోనే బలంగా మాట్లాడారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు రాజధాని తీసుకువెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. ప్రభుత్వమే మోసం చేస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు. నాడు ఆయన చేసిన తప్పిదాలనే నేడు  జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకొని వెళ్తున్నారు. విశాఖలో రాజధాని పెట్టడం అనేది పక్కా వ్యూహం ప్రకారం జరుగుతున్న కార్యక్రమం. తమ బిడ్డల భవిష్యత్తు పణంగా పెట్టిన రైతుల కుటుంబాలకు కచ్చితంగా మద్దతు ఇవ్వాలి. రాజధాని అంశంలో రాజకీయ లబ్ది అనే అంశం పక్కన పెట్టి మొదటి నుంచి బలంగా వాయిస్ వినిపిస్తోంది ఒక్క జనసేన పార్టీ మాత్రమే. రాజధాని వాసులకు న్యాయం చేయాలి అన్నది మన విధానం. అందుకు అవసరం అయితే న్యాయపరంగా గట్టి పోరాటం చేయాలి. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. రైతులు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఒకటి, రెండు రోజుల్లో తేలే అంశం కాదు. సుదీర్ఘ పోరాటానికి మానసికంగా సిద్ధమై ఉండాలి. 100 శాతం రాజధాని ప్రాంత వాసులకు అన్యాయం జరిగింది” అన్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ మాట్లాడుతూ “అమరావతి ఉద్యమం నీరుగారిపోతున్న సమయంలో జనసేన జవసత్వాలు ఇచ్చింది. తరవాత ఆ రైతుల ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ హైజాక్ చేయడం వల్ల ఉద్యమం నష్టపోయింది. రాజధాని పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందకుండా ఆ పార్టీ అడ్డుకుంది. దాని వల్ల అమరావతిలో జరుగుతున్న ఉద్యమానికి చుట్టుపక్కల జిల్లాల ప్రజల నుంచి కూడా మద్దతు కొరవడింది. ఆ మద్దతును కూడగట్టుకోవాల్సిన బాధ్యత ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నవారిపైనే ఉంది. మూడు రాజధానుల పేరు చెప్పి వైసీపీ, వైసీపీ వైఫల్యాలను చూపి టీడీపీ లబ్దిపొందాలని చూస్తున్నాయి. మీడియాలో ఇరు పార్టీలు రాజధానిని తమ రాజకీయ క్రీడకు వేదికగా మార్చుకున్నాయి. 2004లో నాటి పాలకులు దోచుకున్న భూముల విలువ పెంచుకునేందుకు ఇప్పటి పాలకులు మూడు రాజధానుల స్వరం ఎత్తారు. రాజధాని చుట్టూ రెండు పార్టీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు కావాల్సింది ఉద్యోగాలు… ఉపాధి. వాటి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు” అన్నారు.

పార్టీ మరో ప్రధాన కార్యదర్శి (పర్యావరణం)  సత్య బొలిశెట్టి  మాట్లాడుతూ “మూడు రాజధానుల విధానమే తప్పు. ఒక్క కోర్టు పెట్టి జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఎలా అంటారు? న్యాయపరంగా ఈ బిల్లు చెల్లదు” అన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పీఏసీ సభ్యులు  కందుల దుర్గేష్,  కోన తాతారావు,  ముత్తా శశిధర్,  చిలకం మధుసూదన్ రెడ్డి,  పాలవలస యశస్వి, డా.పసుపులేటి హరిప్రసాద్,  పితాని బాలకృష్ణ,  మనుక్రాంత్ రెడ్డి,  బి.నాయకర్,  పంతం నానాజీ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కనకరాజు సూరి పాల్గొన్నారు.

 80,368 total views,  488 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

హైదరాబాద్ మెట్రోలో ‘వకీల్ సాబ్’.. ఫోటోలు వైరల్

మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *