అమ్మోనియం నైట్రేట్ నిల్వల నుంచి విశాఖను కాపాడండి

• విశాఖలో ప్రమాదకర స్థాయిలో నిల్వలు
• బీరూట్ ప్రమాదం నేపధ్యంలో జనసేనాని ముందస్తు అప్రమత్తత
వరుస ప్రమాదాల నేపధ్యంలో స్టీల్ సిటీ విశాఖపట్నం భద్రతపై చర్చ మొదలైంది. లెబనాన్ రాజధాని బీరూట్ లో జరిగిన భారీ ప్రమాదం నేపధ్యంలో మరోసారి ఆ చర్చ ఊపందుకుంది. ముఖ్యంగా భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్ నిల్వలలు విశాఖలో ఉన్న నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందస్తు అప్రమత్తత ప్రకటిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. బీరూట్ ఘటనా స్థలిలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి.. విశాఖలో ఎంత మొత్తం నిల్వలు ఉన్నాయి.. వరుస ప్రమాదాల నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే అంశాలపై పరిశోధనాత్మకంగా నిపుణుల సలహాలు క్రోడీకరిస్తూ ఈ ప్రకటన విడుదల చేశారు.. జనసేన అధినేత విడుదల చేసిన ఆ ప్రకటన సారాంశం…
అమ్మోనియం నైట్రేట్.. బహుళార్థ ప్రయోజనాలు గల రసాయనం. జాగ్రత్తగా వాడుకుంటే ప్రగతి ఫలాలు అందిస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఊహించలేని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఎరువుల తయారీ, గనులలో పేలుళ్లు జరపడానికి ఈ రసాయనాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇటీవల ఈ రసాయనం లెబనాన్ రాజధాని బీరుట్ లో సృష్టించిన విధ్వంసం తలచుకుంటేనే భయాందోళనలు కలుగుతున్నాయి. బీరుట్ ఓడ రేవులోని గోదాములో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్ రసాయనిక చర్య కారణంగా పేలుడు సంభవించి 158 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో నాలుగు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. బీరుట్ నగర జనాభాలో సగం మంది జీవితాలు కకావికలం అయిపోయాయి. 200 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ లోని హిరోషిమా నగరం మీద పడిన అణుబాంబులో ఐదో వంతు శక్తి బీరుట్ పేలుడులో ఉద్భవించింది. రిక్టర్ స్కేల్ పై దీని ప్రకంపనలు 3.3గా నమోదు అయింది. అంటే ఒక మోస్తరు భూకంపం వంటిది. ఈ చిన్న దేశం ఈ ఉత్పాతం నుంచి కోలుకోవడానికి దశాబ్ద కాలం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఈ ప్రమాదంలో 2750 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు పేలాయి… అయితే మన పోర్టు నగరమైన విశాఖపట్నంలో ప్రస్తుతం సుమారు 19500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు వున్నాయి. అంటే సుమారుగా ఎనిమిది రెట్లు ఎక్కువ. మరి ఇవి పేలితే..?
మన దేశం మొత్తం అవసరాల కోసం అమ్మోనియా నైట్రేట్ రసాయనం విశాఖ ఓడ రేవు ద్వారా మాత్రమే దిగుమతి అవుతోంది. రష్యన్ దేశాల ద్వారా దిగుమతులు జరుగుతున్నాయి. ఇది ప్రమాదకరమైన రసాయనం అయినందున కేవలం విశాఖ పోర్ట్ నుంచి మాత్రమే దిగుమతులు జరపడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇక్కడ నుంచే దేశమంతటికీ ఈ రసాయనం సరఫరా అవుతోంది. ఏటా సుమారు 2.7 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు విశాఖ ఓడ రేవులో దిగుమతి అవుతోంది. సరుకును నిల్వ చేయడానికి ఇక్కడ ఏడు గోదాములు వున్నాయి. బీరుట్ ప్రమాదం తరవాత సరుకు ఉన్న గోదాములను అధికారులు పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఈ రసాయనం కారణంగా ఒక్క ప్రమాదమూ జరగలేదని, 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని, అందువల్ల భయాలు వద్దని అధికారులు చెబుతున్నారు.

అయితే ‘కీడెంచి మేలెంచాలి’ అంటారు. ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ఈ ప్రకటన విడుదల చేయడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరడానికి మాత్రమే ఈ ప్రకటన చేస్తున్నాను.
ఈ మధ్యకాలంలో విశాఖలో చిన్నచిన్న తప్పిదాల వల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలను ఈ సందర్భంలో పరిగణనలోకి తీసుకోవాలి. బీరుట్ లో ప్రమాదం జరిగినప్పుడు 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు లేవు. మరి ప్రమాదం ఎలా జరిగింది? పేలుడు ఎందుకు సంభవించిందో మన అధికారులు ఆలోచించాలి. ఒకే చోట ఇంత మొత్తంలో నిల్వలు చేయకుండా వికేంద్రీకరణ జరపడానికి గల అవకాశాలను అన్వేషించాలి. ఈ విషయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చాల సీరియస్ గా తీసుకోవాలి. ఉదాసీనత వహిస్తే, జరగరానిది జరిగితే నష్టం అంచనా వేయడానికి కూడా ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది. విజయవాడ శివారు కొండపల్లిలో కూడా వంద టన్నుల అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ చేస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. నగరాలు, జనావాసాలు మధ్య ఈ రసాయనాన్ని నిల్వ చేయడం శ్రేయస్కరం కాదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళన సహేతుకంగానే కనిపిస్తోంది. షిప్‌యార్డ్, విమానాశ్రయం, తూర్పు నావికాదళ కేంద్రం, హెచ్‌పీసీఎల్ సమీపంలోనే అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ చేస్తున్నారని, అప్రమత్తంగా లేకపోతే పెను విపత్తు తప్పదని విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారి  ఇ.ఎ.ఎస్.శర్మ సైతం హెచ్చరిస్తున్నారు. నిల్వ చేస్తున్న గోదాముల దగ్గర తగిన పర్యవేక్షణ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెల మీద నిప్పుల కుంపటితో ఉన్న విశాఖ నగరం రక్షణకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

 190 total views,  4 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

హైదరాబాద్ మెట్రోలో ‘వకీల్ సాబ్’.. ఫోటోలు వైరల్

మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *