ఆ కోరిక తీరకుండానే ఆయన మనల్ని వదిలివెళ్లడం బాధాకరం-పవన్ కల్యాణ్

* అధికారం రెండు వర్గాలకే పరిమితం కారాదని తపించారు
* వంగపండు పాటకు మరణం లేదు
ఉత్తరాంధ్రకు చెందిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతో బాధించిందనీ ఓ ప్రకటనలో తెలిపారు. తన స్వరాన్ని భాస్వరం గా మార్చిన ప్రజా గాయకుడిగా వంగపండుని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం రెండు వర్గాల గుప్పెట్లోనే నలిగిపోతోందని ఆగ్రహం, ఆవేదనతో రగిలిన సామాజికవేత్త వంగపండు అని తెలిపారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఆయనతో తనకు రెండు దశాబ్దాలుగా అనుబంధం ఉన్నట్టు పవన్ తెలిపారు. 2009లో ప్రజారాజ్యం కోసం ఆయనతో కలిసి పనిచేసిన సందర్భంలో అణగారిన, వెనుకబడిన వర్గాల గురించి ఆయన ఆలోచనలు తనను అమితంగా ఆకట్టుకున్నాయని చెప్పుకొచ్చారు.
జనసేన ఆవిర్భావాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించిన విప్లవ నాయకులలో వంగపండు కూడా ఒకరనీ, ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనలో కలిసి సంఘీభావం తెలిపిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయంటూ అందుకు సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం… రెండు వర్గాల చేతుల నుంచి అన్ని వర్గాలకు చేరిన నాడే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందని, అదే తన చిరకాల కోరికని తన మనసులోని భావాన్ని వ్యక్తం చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు. ఆ కోరిక నెరవేరక ముందే మనల్ని వదిలి ఆయన వెళ్లిపోవడం విషాదకరమన్నారు.
తన పాట ద్వారా తాడిత, పీడిత వర్గాల గుండె చప్పుళ్లను ప్రపంచానికి వినిపించిన విప్లవ గాయకుడంటూ కొనియాడారు. ఆ స్వరం అలసి సొలసి విశ్రమించింది కాని ఆయన ఆశ, ఉత్తరాంధ్ర కొండ కోనల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఊపిరిపోసుకున్న నక్సల్బరీ ఉద్యమంతో ప్రేరణ పొందిన వంగపండును సర్కారీ కొలువును త్యజించి ప్రజా పోరాటమే సర్వస్వంగా భావించిన యోధుడిగా పవన్ అభివర్ణించారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనంపై పోరాటానికి ప్రజలను కదలి రమ్మని ఆయన రచించించిన ‘ ఏం పిల్లడో ఎల్దు మొస్తవా.. ఏం పిల్లో ఎల్దా మొస్తవ” అన్న విప్లవ గీతం ఉత్తరాంధ్రానే కాక యావత్ తెలుగువారందరినీ జాగృతం చేసిందన్నారు. మరో విప్లవ గాయకుడు గద్దర్ తో కలిసి జననాట్యమండలిని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షునిగా కళా సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గిరిజనులు, ఉత్తరాంధ్ర జీవన వైవిధ్యాన్ని తన పాటలకు ప్రేరణగా చేసుకున్న వంగపండు నాలుగు వందల పాటలు రాయడం ఆయనలోని గొప్ప కవికి నిదర్శనమన్నారు. సినిమాలకు సైతం విలువలతో కూడిన గీతాలను అందించిన వంగపండు ‘జజ్జనకర జనారే’ విప్లవ గేయంతో సినీ ప్రేక్షకులను సైతం ఉర్రూతలూగించారని తెలిపారు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వంగపండు చివరి వరకు కష్టాలతోనే జీవన పయనం సాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలతో సహ జీవనం చేసి ఆదర్శప్రాయంగా నిలిచారని పవన్ అన్నారు. భారమైన మనస్సుతో ఆ విప్తవ గాయకునికి నివాళులు అర్పిస్తున్నట్టు తెలిపారు..

 108 total views,  2 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

జనసేనానితో ముత్తంశెట్టి భేటీ.. వరద ముంపు పరిస్థితులపై వివరణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం ఇంఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా శరన్నవరాత్రుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *