ప్రాణాలు తోడేస్తున్న పాలకుల పాపం.. నిరు పేదలకే ఇది శాపం

• ముమ్మాటికీ ఇది మద్యం వధే!

అవును.. మొన్ని విశాఖలో, నిన్న కురిచేడులో, నేడు మరోచోట కూలీల ఉసురు తీసింది.. తీస్తోంది నియంత్రణ కరువైన ప్రభుత్వ నిర్ణయమే. రోజు మొత్తం రెక్కలు ముక్కలు చేసుకుని పదో పరకో సంపాదించుకుని ఇంటికి చేరి ఓ ముద్ద తిని పక్క ఎక్కేవారితో అసలు సమస్యే లేదు. మార్గం మధ్యలో కనిపించే సారాయి దుకాణం రారమ్మని పిలిచే వారితోటే అసలు సమస్య.. రోజంతా పడిన కష్టాన్ని ఆ రెండు చుక్కలు మాయం చేస్దాయన్న ఆలోచనతో కొత్తలోకంలో విహరించే వారితోనే తంటా.. మద్యపానం అంటే తెలియని రోజుల్లో నూటికో కోటికో తాటి చెట్టు కింద ఓ లోటా కల్లు తాగి, దంపుడు బియ్యం తిని బతికిన నాడు క్వింటాలు బరువు ఉండే ధాన్యం మూట కూడా ఒంటి చేత్తో పైకి లేచేది. ఏ అలవాటు లేకపోతే జనం మనకి బానిసలు కారు అనుకున్నారో ఏమో? నాడు ప్యాకెట్లలో ప్రభుత్వ మద్యాన్ని ఊరూరా అమ్మించి మరీ అందరికీ అలవాటు చేశారు.. అలా అయిన అలవాటు చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ప్రధాన ఆదాయవనరు అయిపోయింది. ప్రజల జేబులు గుల్ల చేయడానికి ఎన్ని రకాల పన్నులు వడ్డించినా సురాపానం పెట్టే చిల్లు ముందు అన్నీ దిగదుడుపే. అందుకే మహిళల ఓట్లు అవసరం అయిన నాడు మినహా పాలకులే టార్గెట్లు పెట్టి, వాడవాడలా బెల్టు దుకాణాలు తెరిచి మరీ జనంతో మందెయ్యించారు. తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరకే ఎలా ఉండలేవో, తాగే గ్లాసు కూడా ఖాళీగా ఉండని పరిస్థితి దాపురించింది.
చివరికి సాయంత్రానికి ఆ చుక్క గొంతు దిగందే పక్క పిలవని స్థాయికి మెజారిటీ శాతం జనం వెళ్లిపోయారు. మద్యపానానికి బానిస అయిన వారిలో పేద,గొప్ప, కులం, గోత్రంతో సంబంధం లేని దుస్థితి. ఒకానొక స్థితిలో మద్యపాన నిషేధం పేరు ఎత్తితే ప్రభుత్వాన్నే కూల్చేసే స్థితికి వచ్చేశారు. అంతేకాదు మాములుగా బాటిల్ తాగితే నిషేధం సమయంలో జేబుకి చిల్లు పెట్టుకుని మరీ బ్లాకులో మద్యం రెండు సీసాలు తాగడం మొదలు పెట్టారు. మద్యం ప్రియుల మెప్పు ముసుగులో తిరిగి ప్రారంభమైన విక్రయాలు జనాన్ని మరింత బానిసలుగా మార్చేశాయి.
అలాంటి పరిస్థితుల్లో విడతల వారీ మద్యపాన నిషేధం అంటూ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ అమలులో భాగంగా వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు దిగువ మధ్యతరగతి ప్రాణాలు తోడేస్తున్నాయి. ధర ఎక్కువ కాబట్టి.. మద్యం తక్కువ తాగుతారు అన్న పాలకుల ప్రభోదాలు, బానిసలుగా మారిన కూలి జనాన్ని ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయించింది. ప్రభుత్వ సారాయి దుకాణంలో మద్యం కొనుగోలు చేయాలంటే రోజు సంపాదన మొత్తం ఖర్చు చేయాలి.. చేసినా కిక్కుతో చిక్కు.. తక్కువ ఖర్చుతో మత్తులో పడేసే పానీయం దొరికితే… అన్న ఆలోచన వారిని మృత్యువు కోరల్లోకి తోడ్కెళ్లింది.
• కరోనాకి ముందు స్పిరిట్.. తర్వాత శానిటైజర్
రంగు..రుచితో పనిలేదు.. అది విషం అయినా మత్తు మైకం కమ్మితే చాలు.. సర్కారీ సీసాకి మించి కిక్కు ఇస్తే చాలు.. అది కాపు సారా అయినా.. మరోటి అయినా.. రెండు నెలల క్రితం విశాఖ జిల్లాలో ఇలాగే కొందరు సర్జికల్ స్పిరిట్ సేవించి అయిన వారికి తీరని శోకం మిగిల్చారు. కరోనా రాకకు పూర్వం కూడా ఇలా స్పిరిట్ తాగి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువే. ఆ స్పిరిట్ అలవాటే ఆల్కహాల్ కిక్కు ఇస్తుందన్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేసింది. కరోనా తర్వాత శానిటైజర్ వాడకం పెరగడం.. శానిటైజర్ ప్రకటనల్లో మా ప్రొడక్ట్ లో అంత శాతం ఆల్కహాల్ ఉంది అంటూ ప్రకటించడం చూసిన వారికి అది కూడా కిక్కిస్తుంది అన్న ఆలోచన కలిగించింది. పైగా కరోనా నిరోధం అన్న ప్రచారం నేపధ్యంలో విచ్చలవిడిగా ఈ లిక్విడ్ శానిటైజర్ అందుబాటులోకి వచ్చింది. మద్యం కంటే చవకగా దొరికే ఈ ద్రావణం మరింత కిక్కు ఇస్తుందని భావించిన రోజు కూలీలు, రిక్షా పుల్లర్లు, రోడ్ సైడ్ వ్యాపారుల్లో తక్కువ సంపాదన కలిగిన వారంతా దాని వైపు చూడడం మొదలు పెట్టారు. అది గ్రహించిన కొందరు వ్యాపారులు దాన్ని సొమ్ము చేసుకునేందు ఎవరి ప్రయత్నాలు వారు శక్తి వంచన లేకుండా చేశారు.
ప్రభుత్వం ఎంచుకున్న విధానం.. శానిటైజర్ రూపంలో వెతుక్కుంటూ వచ్చిన ప్రత్యామ్నాయం ప్రకాశం జిల్లా కురిచేడు ప్రాంతంలో 20 కుటుంబాలకు పెద్ద దిక్కు లేకుండా చేశాయి. సాయంత్రానికి తాగి వచ్చినా సంపాదనలో ఎంతో కొంత ఇంటికి తెచ్చే వారు, ఇప్పుడు నిర్జీవులై కాటికి చేరారు. ఆ తర్వాత కూడా నిత్యం ఏదో ఒక మూల ఈ మద్యం కాని మద్యం వధ సాగుతూనే ఉంది.
• మద్యం-శానిటైజర్ మధ్య తేడా ఏంటి?
మద్యంలో ఉండేదీ ఆల్కహాలే.. శానిటైజర్ నిండా ఉండేదీ ఆల్కహాలే.. రెంటికీ మధ్య తేడా ఏంటి? ఆల్కహాల్ లో నాలుగు రకాలు ఉంటాయి.. మొదటి రకం ఎక్సట్రీన్యూట్రల్ ఆల్కహాల్.. ఇది శుద్ది చేసిన మినరల్ వాటర్ లాంటిది దీన్ని మద్యం తయారీలో వినియోగిస్తారు. తక్కువ రకం ఆల్కహాల్ ని రీసైకిల్డ్ స్పిరిట్ అంటారు. మురుగు కాల్వలో నీరు లాంటిది ఇది. నిలువెల్లా విషం నింపుకుని ఉన్న ఈ స్పిరిటే ఇప్పుడు శానిటైజర్ వ్యాపారులకు కాసుల పంట పండిస్తోంది. ప్రమాదకరమైన వ్యర్ధాలతో కూడినది కావడం, హైపోక్లోరైడ్ ద్రావణం కలగలిసిన మిశ్రమం కావడంతో ఇది తాగిన కొద్ది నిమిషాలకే మానవ కాలేయాన్ని పూర్తిగా పాడుచేస్తుంది. మత్తుకు బానిసలుగా మారిన జనం శానిటైజర్ ను కేవలం కిక్కు ఇచ్చే పదార్ధంగానే చూస్తూ… దాన్ని సేవించి శాశ్విత నిద్రలోకి జారుకుంటున్నారు.
• మద్య నిషేధం అన్ననాడే హెచ్చరించిన జనసేన అధినేత
విడతల వారీ మద్య నిషేధంలో భాగంగా ధరలు భారీగా పెంచేశాం కాబట్టి ఎవ్వరూ తాగరు అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చేసి పాలకులు చేతులు దులుపేసుకున్నారు. తాగుడుకి బానిసలు అయిన జనం ధర పెంచితే ప్రత్యామ్నాయాల వైపు చూస్తారు అన్న కనీసం ఇంగితాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మద్య నిషేదం అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించినప్పుడు., అలాంటి ప్రయత్నాలు అమెరికా లాంటి దేశాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపాయన్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివరించారు. అక్కడ మాదక ద్రవ్యాల వ్యాప్తి పెరిగి, వాటి నుంచి జనాన్ని కాపాడేందుకు పాలకులు ముప్పుతిప్పలు పడిన విషయాన్ని గుర్తు చేశారు. మద్యపాన నిషేధం అనేది ఎవరో చెప్పి చేయిస్తే జరిగేది కాదనీ, ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని పవన్ వెల్లడించారు. గతంలో మద్య నిషేధం విధించిన సమయంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మద్యాన్ని బ్లాకులో కొని మరీ తాగిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో పాటు కాపు సారా, స్పిరిట్ లాంటి ప్రత్యామ్నాయ మత్తు పదార్ధాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని జనసేనాని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని వారించారు. అయితే ఎవరి సూచనలు తీసుకునే పరిస్థితి లేని పాలకులు అడ్డంగా తాము అనుకున్నది చేస్తూ వచ్చారు. మద్యం ధర అయితే పెంచారు గానీ ప్రత్యామ్నాయాల నియంత్రణలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కాపు సారా, స్పిరిట్ అమ్మకాల మీద నియంత్రణ కొరవడింది. కరోనా పుణ్యమా అని శానిటైజర్ అమ్మకం పూర్తిగా అదుపు తప్పింది. అదే సమయంలో క్వాలిటీ చెకింగ్ కు అవసరమైన సదుపాయాలు యంత్రాంగానికి అందుబాటులో లేకపోవడంతో వారూ చేతులెత్తేశారు. ఫలితం నిత్యం ఏదో ఒక మూల కరోనాతో పాటు శానిటైజర్ చావులు మొదలయ్యాయి. కురిచేడులో ఒక్కసారిగా రెండంకెల సంఖ్యలో పేదలు చనిపోవడంతో విషయం బయటకు వచ్చింది గానీ నిత్యం ఏదో ఒక మూల పేద జీవితాలు కూలుతూనే ఉన్నాయి.
కురిచేడులో చనిపోయిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని వారే.. మరి ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? వారి చావులకు ఎవరు బాధ్యత వహిస్తారు? లోపభూయిష్ట విధానాలు తెచ్చిన పాలకులా? కాసుల కోసం నాణ్యత మరచిన వ్యాపారులా? పాపం ఎవరిది అయినా బలైంది మాత్రం బడుగు జీవులే.

 470 total views,  4 views today

Spread the love

About Syamkumar Lebaka

Check Also

మత్సకారులతో జనసేన సమన్వయం.. పార్టీలోకి చేరికలు

నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతంపై స్థానిక జనసేన నాయకత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *