రాజధాని తరలింపుపై జనసేన కౌంటర్.. తుది వరకు రైతుల పక్షాన నిలబడదామన్న జనసేనాని..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపునకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హైకోర్టు రాజకీయ పార్టీలకు కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే మూడు వారాల్లో వేయాలని సూచించిన నేపధ్యంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో టెలీ కాన్ఫరెన్స్ జరిగింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను జనసేనాని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రాజధాని తరలింపు, పాలన వికేంద్రీకరణ విషయంలో జనసేన పార్టీ తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే వస్తోంది. ప్రభుత్వాన్ని విశ్వసించి భూసమీకరణ ద్వారా 33 వేల ఎకరాలను 28వేల మందికి పైగా రైతులు తమ పంట పొలాలను ఇచ్చేశారు. తమ భూములు ఇచ్చిన వేల మంది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు అని జనసేన బలంగా చెబుతోంది. అలాగే అక్కడి భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారు. మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే ప్రజాధనాన్ని ఇప్పటికే రాజధాని కోసం వెచ్చించారు. పర్యావరణహితమైన రాజధాని నిర్మాణం జరగాలి అని చెబుతూ వస్తున్నాం. ప్రస్తుత తరుణంలో రాజధాని తరలింపు అంశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటికి సంబంధించి పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం.

గౌరవ హైకోర్టు ఈ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కౌంటర్ దాఖలు చేస్తాం. ఈ కేసులో తుది వరకూ బాధ్యతగా నిలబడతాం. ఈ రోజు పార్టీ ముఖ్యుల అభిప్రాయాలూ తెలుసుకున్నాం. న్యాయ నిపుణుల సలహాలు, వారి సహకారంతో గడువులోగా కౌంటర్ వేస్తాం అని అన్నారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ…రాజధాని రైతుల విషయంలో మన పార్టీ ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తోంది. అక్కడి రైతులకు సక్రమంగా కౌలు ఇవ్వడం లేదని గతేడాది మన దృష్టికి రాగానే ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అండగా నిలుస్తాం చెప్పి పర్యటనకు వెళ్ళగానే ఆ మొత్తాలు చెల్లించారు. ఈ ఏడాది కూడా కౌలు ఇవ్వకపోతే వారి పక్షాన బలంగా డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్ర శేఖర్ మాట్లాడుతూ “వైసీపీ, టిడిపిలు తమ ఆధిపత్య ప్రదర్శనకు రాజధాని అమరావతిని బలి చేస్తున్నారు. ఒక నూతన రాజధానిని నిర్మించుకొనే సదావకాశాన్ని, విలువైన సమయాన్ని ఈ పార్టీలు వృథా చేస్తున్నాయి. మన జనసేన పార్టీ మాత్రమే తొలి నుంచి ఒకే అభిప్రాయాన్ని బలంగా, స్పష్టంగా చెబుతూ వస్తోంది. మన పార్టీ ధర్మం పక్షాన నిలుస్తుందని ప్రజలు అర్థం చేసుకున్నారు. కౌంటర్ ను బలంగా దాఖలు చేయాలన్నారు. పర్యావరణ విభాగ ప్రధాన కార్యదర్శి సత్య బొలిశెట్టి మాట్లాడుతూ “పర్యావరణహితమైన సహజ రాజధాని నిర్మితం కావాలి. అమరావతికి చక్కటి జల వనరుల లభ్యత ఉంది. అక్కడ రాజధాని కోసం కేంద్రం రూ.2500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.6500 కోట్లు మేరకు నిధులు ఇచ్చాయని తెలిపారు. మరో ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ… రాజధాని విషయంలో సాగుతున్న పరిణామాలను, అధికార ప్రతిపక్షాల తీరుని అన్ని ప్రాంతాల ప్రజలు గ్రహించారు. మన పార్టీ విధానాన్ని అందరూ అర్థం చేసుకొంటున్నారు” అని తెలిపారు. అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ మాట్లాడుతూ “రాజధాని తరలింపునకు సంబంధించి సుమారు 75 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటి విచారణలో కౌంటర్ దాఖలు చేసే అవకాశాన్ని రాజకీయ పక్షాలకు హైకోర్టు ఇవ్వడం ఒక కీలక పరిణామమని తెలిపారు.

 1,992 total views,  2 views today

Spread the love

About Admin

Check Also

పోలీసుల నిర్భంధంలో గండికోట నిర్వాసితులు.. రంగంలోకి జనసేనాని..

బాధితులకు న్యాయం చేశాకే ముందుకెళ్లాలన్న పవన్ ఆందోళనలో పాల్గొన్న జనసేన నాయకులు గండికోట ఫేస్ 2 నీటి నిల్వ సామర్ధ్యం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *