పింక్ డైమండ్ నీ పంచుకున్నారా? ష్..గప్ చుప్..

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రథం దగ్గం ఘటనతో దేవుడికే నామాలు పెడుతున్న మన నాయకుల ఘనత మరోసారి తెరమీదకి వచ్చింది.. హైదంవ సంస్కృతిని మంటగలిపే ప్రయత్నాల్లో భాగంగా దేవతా విగ్రహాలు, ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని ప్రతిఘటించే క్రమంలో., కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరునికే నామాలు పెట్టిన మన ఘనుల ఘన చరిత్రను మరోసారి తెర మీదకి తెచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం వచ్చే ఆలయం తిరుమల. ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారి అయినా రెండు చేతులు పైకెత్తి గోవిందలు కొడుతూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కన్నులారా తిలకించాలని కలలు గంటారు. వడ్డికాసుల వాడిగా పేరున్న వెంకన్నకు నాటి రాజుల కాలం నుంచి నేటి కుభేరుల కాలం వరకు సమర్పించుకున్న, నిత్యం సమర్పించుకుంటోన్న కానుకలు లెక్కించనలవి కానివి. అందులో ఎంతో విలువైన వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు కూడా ఉన్నాయి. వాటికి సైతం విలువ కట్టలేం. శ్రీనివాసుడు కొలువైన ఏడుకొండలతో పాటు భక్తులు ఇచ్చిన ఈ మొత్తం సంపదలో ఒక్క ఈక కదిలినా ఆయన చూస్తూ ఊరకుండడు. మొక్కిన మొక్కులు మర్చిపోతేనే గుర్తు చేసి మరీ వడ్డీతో సహా తీసుకుంటారన్న విశ్వాసం, భయంతో కూడిన భక్తి కూడా ఆయన భక్తులకు ఉంటుంది.

అలాంటిది వినాశ కాలే విపరీత బుద్ది..  అన్న పెద్దల మాటను నిలబెట్టేందుకు ఘనత వహించిన మన నాయకులకు పోయే కాలం దాపురించిందో ఏమో శ్రీ వెంకటేశ్వరుడి ఆస్తులపై కన్ను పడింది. వెనుకటికి ఓ పెద్ద మనిషి ఆయన కొండల్ని ముట్టుకోబోతే ఏం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజల్ని దోచుకున్నది సరిపోలేదో ఏమో ఇప్పుడు అంతా కలియుగంలోనే మోస్ట్ పవర్ ఫుల్ గాడ్ అయిన ఆయన ఆస్తుల మీద పడ్డారు. ఎవరికీ తెలియకుండా వజ్రాల గదికి కన్నం వేసేశారు. పింక్ డైమండ్ ఎత్తేశారు. భగవంతుడి ఆస్తులు నొక్కేస్తే ఆయన నేరుగా వచ్చి దుష్ట సంహరణం చేయడానికి ఇదేమీ ద్వాపరయుగమో, త్రేతాయుగమో కాదు కదా అనుకున్నారో? శిల ఏం మాట్లాడుతుంది అనుకున్నారో గానీ., కొట్టేసి వజ్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా దేశం కూడా దాటించేశారని టాక్..

తన ఏడుకొండల్లో గజం నేల కదిలితేనే సహించని ఏడుకొండల వాడు వజ్రం కొట్టేస్తే ఊరుకుంటాడా…? ఈ పాపులకు నేరుగా కనబడే సాహసం చేయకపోయినా దొంగని ఊరికే వదులుతాడా?  ఏ రమణ దీక్షితులు లాంటి వారి నోటో నిజాన్ని బయటకు కక్కించేశాడు.. గుడినీ, గుళ్లో లింగాన్ని మింగేసే సత్తా ఉన్న మన నాయకులు ఏమైనా తక్కువ తిన్నారా ఏంటి.? వజ్రాన్ని నాణాళతో పగుల గొట్టించేశారు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అబద్దం ఇది అన్న సంగతి విన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.. కానీ ప్రశ్నించే దెవరు? ఏడుకొండలవాడి తరఫున నిలబడేది ఎవరు?

స్వతంత్రానంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ఒక సారి చూస్తే.. తెలుగుదేశం పార్టీ రూపంలో ప్రాంతీయ పార్టీ వెలిసేంత వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఏలింది. ప్రజలు ఎప్పుడైతే ప్రత్యామ్నాయాన్ని ఆహ్వానించారో.. అందుకు తగ్గట్టు నాయకులు సైతం రంగులు మార్చేసుకున్నారు.. అధికారంలో ఉన్న వారు మాత్రమే దోచుకునే పరిస్థితి కాస్త.. అధికారంలో ఉన్న వారికి మెజారిటీ వాటా? ప్రతిపక్షంలో ఉన్న వారికి కాస్త తక్కువ వాటా అన్న చందంగా మార్పులు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో రాయలసీమ ప్రాంతంలో కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి చూస్తే అక్కడ నాయకుల రాజనీతి చూస్తే చాణక్యుడు సైతం గుండెలు బాదుకోకతప్పదు. కత్తులు దూసుకుని, బాంబులు విసురుకుని చంపుకుంటామంటూ కలర్ ఇచ్చే నాయకులు., తెరవెనుక పంపకాలు చేసేసుకోవడం మొదలు పెట్టారు. దోచుకునే వర్గం.. దోపిడికి గురయ్యే వర్గంగా ప్రజల నుంచి తమను తాము వేరు చేసుకుని దోపిడిలో కూడా న్యాయం వెతుక్కున్నారు. అధికారంలో ఉన్న వారికి 60 శాతం, ప్రతిపక్షంలో ఉన్న వారికి 40 శాతం వాటాలు తెంచేసుకున్నారు. దొంగతనం.. ఇంకేదోతం.. ఎక్కువ కాలం దాగవు కదా.. ఇక్కడా అదే జరిగింది. జనానికి నాయకుల 60 : 40 బాగోతం తెలిసిపోయింది. తెలిసినా ఏమీ చేయలేక వారి పాపాన వారే పోతారులే అని ఒక నిట్టూర్పు నిట్టూర్చి యధావిధిగా తమకి నోటు ఇచ్చిన వారికి ఓటు వేసేసి చేతులు దులిపేసుకుంటూ వస్తున్నారు..

శ్రీవారి వజ్రం మాయం కావడానికీ ఈ 60 : 40కి సంబంధం ఏంటి? అనుకుంటున్నారా.. ఈ 60 : 40 పంపకాలు రాయలసీమ ప్రాంతాన్ని దాటి రాష్ట్ర స్థాయికి వచ్చేయడమే ఆ సంబంధం. 2014కి ముందు వరకు కాంగ్రెస్-తెలుగుదేశం.. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ-తెలుగుదేశం.. రంగులు మారినా అవే రాజకీయాలు. ఆ రెండు వర్గాల చెప్పుచేతల్లోనే అధికారం ఉంటుంది. మాట్లాడితే ఒకరు లక్ష కోట్లు దోచారు అంటే.. ఇంకొకరు రెండు లక్షల కోట్లు దోచారు అని పరస్పరం ఆరోపణలు చేసుకుంటారు.. జనాన్ని పిచ్చివాళ్లను చేస్తూ అధికారాన్ని వారి చేతలో నుంచి వీరి చేతిలోకి.. వీరి చేతిలో నుంచి వారి చేతిలోకి మార్చుకుంటూ ఉంటారు.. చాలా బలంగా ఆరోపణలు చేసుకుంటారు.. కానీ అవన్నీ ఆరోపణల వరకే పరిమితమవుతాయి.  ఇదీ రాష్ట్ర రాజకీయం.. 60 : 40..

శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంలోనూ అదే జరిగిందేమో..? వజ్రం మాయం అయ్యింది. దేవుడి రథాలను మతిస్థిమితం లేని వాళ్లు తగులబెట్టిన చందంగా.. వజ్రం రూపాయి కాసులు తగిలి పగిలిపోయింది. అంతే కేసు క్లోజ్. ఇది సాధ్యం కాదు అని తెలిసినా నాటి విపక్షం.. నేటి అధికార పక్షం.. నోరు తెరవదు. నాడు – నేడు మాట్లాడుతోంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కడే. పింక్ డైమండ్ పగిలిపోయిన వ్యవహారాన్ని కూడా సి.బి.ఐ.తో విచారణ చేపట్టాలని ఆయన  నాటి నుంచి నేటి వరకు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.. అయన డిమాండ్ ప్రజలకు చేరదు.. ఎందుకంటే ఆ రెండు వర్గాలకు కొమ్ముకాయడానికి అలవాటు పడిన ప్రసార మాధ్యమాల్లో జనసేనాని వార్తలకు చోటుండదు. అదే పవన్ కల్యాణ్ కాపుల రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఆ వార్తను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురిస్తాయి. మిగతా కులాల గురించి, సమస్యల గురించి మాట్లాడినప్పుడు కనిపించని పవన్ ఒక్కసారిగా మొదటి పేజీకి ఎందుకు వస్తాడు అంటే.. అక్కడ కూడా పేరు మోసిన ఆ ప్రసార సాధనాలు తాంత్రిక వ్యూహాల్లో భాగంగానే వార్తలు రాస్తాయి. కాపుల గురించి మాట్లాడితే కులం అంటగట్టవచ్చన్నదే ఆ తంత్రం.

అంతర్వేది రథం సెగ గట్టిగా అంటడంతో దాన్ని ఆర్పడానికి సి.బి.ఐ. విచారణ అంటూ సర్కారు చేతులు దులిపేసుకుంది. మరి అదే పవన్ కల్యాణ్ వెంకన్న పింక్ డైమండ్ వ్యవహారం కూడా సీబీఐకి అప్పగించమంటూ చేస్తున్న డిమాండ్ మాత్రం ప్రభుత్వం పట్టించుకోదు. రెండు వర్గాలుగా చీలిపోయిన ప్రసార మాధ్యమాలు(మీడియా) సైతం ఆ డిమాండ్ కి ప్రాధాన్యత ఇవ్వదు. అదే అర్ధం అయ్యిందిగా     60 : 40.. అంతా ష్.. గప్ చుప్.. మరి ఈ నిజం జనం ఎప్పుడు తెలుసుకుంటారో..? ఏమో?

 14,006 total views,  3 views today

Spread the love

About Admin

Check Also

జనసేనకు ఫేక్ ఫ్రెస్ నోట్ల బెడద.. టార్గెట్ అదేనా?

ఫిర్యాదులు చేసిన పట్టించుకోని చట్టం పార్టీ శ్రేణుల్ని గందరగోళానికి గురిచేయడం మొదటి టార్గెట్ జనసేన-బీజేపీ కూటమిలో మంటలు రాజేయడం రెండో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *